A Madman's Diary - Lu Xiun, China 1919
A Madman's Diary - Lu Xiun, China 1919
పిచ్చివాని డైరి
లూసన్
లూసన్
A Madman's Diary - Lu Xiun, China (1919)
తెలుగు అనువాదం : ఉషా యస్ డానీ (2015)
వాళ్ళిద్దరూ అన్నదమ్ములు. వాళ్ల పేర్లు ఇక్కడ అప్రస్తుతం.
హైస్కూలు రోజుల్లో వాళ్ళు నాకు మంచి మిత్రులు. ఆ తరువాత దూరమైపోయాము. ఇన్నేళ్లలో మేము మళ్ళీ కలుసుకోలేదు. వాళ్ళలో ఒకడికి తీవ్రంగా జబ్బు చేసిందని కొన్నాళ్ల క్రితం ఎవరో చెప్పగా తెలిసింది. ఈసారి మా ఊరికి వెళుతూ ప్రయాణం మధ్యలో ఆగి వాళ్లను చూడడానికి వెళ్ళాను. అన్నఒక్కడే కనిపించాడు. జబ్బు చేసింది తమ్ముడికి అని తెలిసింది.
"నువ్వు అంత దూరం నుండి మమ్మల్ని చూడ్డానికి రావడం చాలా ఆనందంగా వుందోయి. తమ్ముడికి ఇప్పుడు నయం అయింది. మళ్ళీ డ్యూటీలో చేరాడు. ప్రస్తుతం ఆఫీసు పని మీద ఊరెళ్ళాడు" అన్నాడు అన్న.
ఆ తరువాత తమ్ముడు రాసుకున్న రెండు డైరీలు తెచ్చి నాకు ఇస్తూ, “వీటిని తిరగేస్తే మా వాడికి వచ్చిన జబ్బు ఏమిటో నీకే అర్ధం అవుతుంది” అన్నాడు. అంతలో, నా సందేహాన్ని గమనించినట్టు “పాత మిత్రుల డైరీలు చూడడం తప్పుకాదులే” అంటూ అడక్కుండానే తనే ఓ వివరణ కూడా ఇచ్చాడు.
నేను ఆ డైరీలు తీసుకుని చదవడం మొదలెట్టాను. లోకంలో అందరూ ఏకమై తనను ఒంటరివాడ్ని చేసి అణిచివేస్తున్నారని అతను తీవ్ర ఆవేదనకు గురైనట్టున్నాడు. తను డైరీ రాసుకున్న తీరు గందరగోళంగాను, గజిబిజిగానూ వుంది. కొన్నిచోట్ల అతను రాసుకున్న అభిప్రాయాలు చాలా తీవ్రంగా వున్నాయి. ఎక్కడా తేదీలు రాయలేదు. సిరా రంగునిబట్టీ, చేతిరాతనుబట్టి అవన్నీ ఒక్కరోజులో రాసినవి కావని తెలుస్తోంది. అలా కిస్తీలుగా రాసినా వాటి మధ్య ఒక అంతఃస్సంబంధం కనిపిస్తోంది. నా వైద్యశాస్త్ర పరిశోధనలకు పనికివస్తాయని వాటిల్లో కొన్ని భాగాలను నేను నకలు రాసుకున్నాను.
అతని అభిప్రాయాలు చాలా అసంబధ్ధంగా కనిపించినప్పటికీ వాటిల్లో ఒక్కదాన్ని కూడా నేను సవరించలేదు. కేవలం అందులోని పేర్లు మాత్రమే మార్చాను. అవన్నీ బయటి ప్రపంచానికి బొత్తిగా తెలీని స్థానిక గ్రామీణుల పేర్లు. అలా పేర్లు మార్చక పోయినా పెద్ద తేడా వచ్చేదికాదు. ఇక శీర్షిక గురించి అంటారా? జబ్బు నయం అయ్యాక అతనే ఆ పేరు పెట్టుకున్నాడు. నేను దాన్ని మార్చలేదు.
1.
ఈ రాత్రి చంద్రుడు చాలా ప్రకాశవంతంగా వున్నాడు.
ఇంతగా వెలిగిపోతున్న చంద్రుడ్ని ముఫ్ఫయి యేళ్ల కాలంలో నేను ఎప్పుడూ చూడలేదు. ఈరోజు చంద్రుడ్ని చూడగానే ఎన్నడూ లేనంత ఉద్వేగానికి లోనయ్యాను. గత ముఫ్ఫయి యేళ్ళుగా నేను అంధకారంలో వున్నానని అర్ధం అయింది. ఇకముందు నేను ఎంతో జాగ్రత్తగా వుండాలి. లేకపోతే, ఛావో ఇంటి దగ్గర ఆ కుక్క నన్ను అలా రెండుసార్లు తీక్షణంగా ఎందుకు చూస్తుందీ?
నా భయానికి సహేతుక కారణాలున్నాయి!.
2
ఈ రాత్రి ఆకాశంలో చంద్రుడు లేడు. ఇది కీడును సూచిస్తున్నదని నాకు తెలుసు. నేను కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రోజు ఉదయం బయటికి వెళ్ళినపుడు ఆ ఛావో కళ్ళలో వింత చూపులు గమనించాను. అతను నన్ను చూసి భయపడుతున్నట్టో, నన్ను చంపాలని అనుకుంటున్నట్టో వున్నాయా చూపులు. అక్కడ ఆరేడుగురు వున్నారు. వాళ్లంతా నా గురించే గుసగుస లాడుకుంటున్నారు. నాకు ఎదురైనవాళ్లంతా అలాంటివాళ్ళే. వాళ్ళలో ఎప్పుడూ కోపంగా ఊగిపోయే వాడొకడు ఈరోజు నా వైపు నవ్వుతూ చూశాడు. వాళ్ల సన్నాహాలు పూర్తి అయినట్టున్నాయి. ఆ విషయం తెలిసి నేను నిలువెల్లా వణికిపోయాను.
భయాన్ని దాచుకుంటూ నేను ముందుకు సాగాను. దారిలో కొందరు పిల్లలు కూడా నా గురించే చర్చించుకుంటున్నారు. వాళ్ల చూపులు కూడా సరిగ్గా ఆ ఛావో చూపుల్లానే వున్నాయి. వాళ్ల ముఖాలు కూడా దయ్యాల్లా పాలిపోయి వున్నాయి. ఆ పిల్లలు ఎందుకలా ప్రవర్తిస్తున్నారూ? వాళ్లకు నామీద ఎందుకీ కక్షా? ఇక నేను తట్టుకోలేకపోయాను.
“నాకు చెప్పండి” అని గట్టిగా అరిచాను.
వాళ్ళు పారిపోయారు.
ఛావో నా మీద కక్షను పెంచుకోవడానికి కారణం ఏమైవుంటుందీ? ఆ రోడ్డు మీది జనానికి నా మీద ఎందుకా కక్ష? ఎంత ఆలోచించినా నాకు అర్ధం కావడంలేదు. నాకైతే ఒకటే తోస్తోంది. ఓ ఇరవై యేళ్ల క్రితం ఒక సంఘటన జరిగింది. మా ఇంట్లో గుమాస్తాగా పనిచేస్తుండిన కూ చియూ ఏళ్ళ తరబడి రాస్తున్న ఖాతా పుస్తకాలను ఓరోజు నేను పాడు చేశాను. దానితో కూ అసహనంతో ఊగిపోయాడు. కూ తో ఛావోకు పరిచయం లేకున్నా నేను చేసిన పాడు పని అతనికి తెలిసివుంటుంది. దానితో నా మీద కక్ష పెంచుకుని వుంటాడు. రోడ్ల మీద తిరిగే పది మందిని పోగేసి నా మీద కుట్ర చేస్తున్నాడు.
అది సరేగానీ, ఈ పిల్లల సంగతేంటీ? అప్పటికి వాళ్ళు అసలు పుట్టనే లేదే. మరి ఈరోజు అంత విచిత్రంగా నన్ను ఎందుకు చూసినట్టూ? నన్ను చూసి ఎందుకు భయపడిపోతున్నట్టూ? నన్ను అంతం చేయాలని ఎందుకు అనుకుంటున్నట్టూ? అదే నాకేమీ అర్ధం కావడంలేదు.
నిజంగా భయం వేస్తోంది. మనసు వికలమైపోతోంది.
నాకు తెలుసు. ఇలాంటి ప్రమాదకరమైన ఆలోచనల్ని వాళ్ళు తమ తల్లిదండ్రుల నుండి నేర్చుకుని వుంటారు!.
3.
రాత్రుళ్ళు నాకు నిద్ర పట్టడంలేదు. మనం దేన్నయినా అర్ధం చేసుకోవాలంటే దాన్ని అన్ని కోణాల్లోంచీ జాగ్రత్తగా పరిశీలించాలికదా! నేను రోజూ ఆ పనే చేస్తున్నాను.
మా ఊరిలో న్యాయమూర్తుల చేత గట్టిగా చివాట్లు తిన్నవారున్నారు. కులపెద్దల చేతుల్లో పిడిగుద్దులు తిన్నవారున్నారు. తమ భార్యల్ని అధికారులు బలవంతంగా తీసుకుపోతుంటే నిస్సహాయులుగా నిలబడి ఏడ్చిన మొగుళ్ళున్నారు. అప్పులోళ్ళ ఆగడాలు పడలేక ఆత్మహత్యలు చేసుకున్నవాళ్ల పిల్లలున్నారు. వాళ్ళెప్పుడూ నిన్న ఆ పిల్లల్లా అంతగా భయపడినట్టుగానీ, భీకరంగా మారినట్టుగానీ నేనెప్పుడూ చూడలేదు.
మరీ నమ్మలేకపోతున్న విషయం ఏమంటే నిన్న వీధి మొగలో ఒకామె నావైపు చూస్తూ తన కొడుకును లాగి లెంపకాయ కొట్టింది. ”ఒరేయ్ పిల్లదెయ్యం! మా నమ్మకాల్ని కనుక దెబ్బతీశావంటే నిన్ను ముక్కలు ముక్కలుగా కొరికి తినేస్తా” అని భయపెట్టింది. నన్ను నేను తమాయించుకోలేకపోయాను. గబగబా నడిచివచ్చేశాను. ఆకుపచ్చని ముఖాలు, కోరపళ్ళు వేసుకుని అక్కడ గుమిగూడిన వాళ్లంతా నా వెనక వెకిలిగా నవ్వడం మొదలెట్టారు. ముసలి ఛెన్ కంగారుగా పరుగెత్తుకు వచ్చి నా రెక్క పట్టుకుని ముందుకు లాక్కొని పోయాడు.
సుడిగాలిలా నన్ను తీసుకొచ్చి మా ఇంట్లో పడేశాడు ఛెన్. మా ఇంట్లోవాళ్ళు ఏమీ జరగనట్టే వుండిపోయారు. వాళ్ల కళ్లల్లోనూ అవే చూపులు. కొంత కాలంగా ఇతరుల కళ్ళలో నేను గమనిస్తున్న చూపులే అవి. నేను నా పుస్తకాల గది లోనికి వెళ్ళాను. కోడిపెట్టో, బాతో గూటి లోనికి దూరగానే తలుపు మూసినట్టు వాళ్ళు నా గదికి బయటి నుండి గొళ్ళెం పెట్టి తాళం వేసేశారు. ఈ సంఘటనతో నా అనుమానం మరింత బలపడింది.
ఈ ఏడాది వ్యవసాయం బాగోలేదని చెప్పడానికి కొన్ని రోజుల క్రితం పల్లెటూరు నుండి మా కౌలు రైతు వచ్చాడు. అప్పుడు మా అన్నయ్యకు అతనొక భయానక విషయం చెప్పాడు. ఆ గ్రామంలో ఒక దుర్మార్గుడ్ని స్థానికులు పట్టుకుని కొట్టి చంపేశారట. ఊర్లో కొందరు అతని గుండెకాయ, కార్జాన్ని కోసి నూనెలో వేయించి ఉప్పూకారం చల్లుకుని తిన్నారట. ధైర్యాన్ని పుంజుకోవడం కోసమట వాళ్ళు అలా చేసింది. నేను ఏదో అడగబోతే కౌలుదారు, మా అన్నయ్య ఇద్దరూ నాకేసి కళ్ళెర్రజేసి చూశారు. వాళ్ల కళ్ళల్లో కూడా సరిగ్గా అవే చూపులు వున్నట్టు ఈరోజే నాకు అర్ధం అయింది. బయట జనం కళ్ళల్లో రోజూ నేను చూస్తున్న చూపులే అవి!
ఇవన్నీ ఆలోచిస్తుంటే, నెత్తి నుండి అరికాళ్ళ వరకు నా అవయవాలన్నీ గజగజా వణికి పోతున్నాయి. నాకు ఓ విషయం స్పష్టంగా అర్ధం అయింది. వాళ్ళు మనుషుల్ని తింటున్నారు!. అంటే నా వంతు కూడ వస్తుంది. ఒకరోజు వాళ్ళు నన్ను కూడా తినేస్తారు!.
ఆ రోజు ఆ మహిళ “కొరికి తినేస్తా” అనడం, కోరలు చాచిన ఆ ఆకుపచ్చ ముఖాలవాళ్ళు నవ్వడం, మా కౌలురైతు కథ చెప్పడం ఇవన్నీ రహాస్య సంకేతాలు అన్నమాట. వాళ్ల మాటల్లోని విషాన్నీ, వాళ్ల నవ్వుల్లోని బాకుల్నీ నేను పసి కట్టేశాను. వాళ్ల పళ్ళు కోరల్లా మెరుస్తున్నాయి. సందేహం లేదు; వాళ్ళు నరమాంసాహారులు.
ఇప్పుడు నాకు అర్ధం అవుతున్నదేమంటే, నేను చెడ్డవాడ్ని కానప్పటికీ, కూ ఖాతా పుస్తకాలని నేను పాడుచేసినప్పటి నుండి ప్రాణాపాయం నన్ను వెంటాడుతోంది. వాళ్ళేవో రహాస్యాల్ని దాస్తున్నారు. అవేంటో నేను ఊహించలేకపోతున్నాను. వాళ్లకు కోపం వస్తే చాలు; ఎవరినైనాసరే చెడ్డవాడని ముద్ర వేసేస్తారు. ఆ తరువాత చంపుకు తినడం వాళ్ళకు సులువు!.
మా అన్నయ్య నాకు కొన్నాళ్ళు దగ్గరుండి హోంవర్క్ రాయించేవాడు. ఆ సంఘటన ఇప్పటికీ గుర్తుంది. లోకం వున్నది వున్నట్టే వుండాలనేది మా అన్నయ్య తీర్మానం. లోకంతీరుపై అసహనం వ్యక్తం చేసేవాళ్ళని మా అన్నయ్య ఏమాత్రం సహించేవాడుకాదు. వాళ్ళు మంచిమనుషులు అయినా సరే ఒప్పుకునేవాడుకాదు. మరి నేను లోకం తీరుని సమర్ధించినపుడు మా అన్నయ్య ఎంతో మెచ్చుకునేవాడు. “అదే నీకు మంచిది. అది వాస్తవానికి అద్దం పడుతుంది” అనేవాడు.
మనుషులు తాము పొందిన జ్ఞానం ప్రకారం మసులుకుంటారు. తను పొందిన జ్ఞానానికి విరుధ్ధంగా ప్రవర్తించే అరుదైన వ్యక్తి మా అన్నయ్య.
రహాస్యంగా వాళ్ళు చేస్తున్న భయంకరపు ఆలోచనల్ని అంచనా వేయడం నాకు సాధ్యం కావడంలేదు. వాళ్ళు ఏకంగా మనుషుల్నే తినేయడానికి సిధ్ధమైపోయినప్పుడు ఎలా సాధ్యం అవుతుందీ?
మనం దేన్నయినా అర్ధం చేసుకోవాలనుకుంటే ప్రతి విషయాన్నీ జాగ్రత్తగా పరిశీలించాలి. నాకు తెలిసినంత వరకు ఆదిమకాలంలో మనుషులు సాటి మనుషుల్ని తినేవారు. అయితే ఈ విషయంలో నాకు అంత స్పష్టత లేదు. పుస్తకాలు చదివి ఈ అంశంలో నా అవగాహనను పెంచుకోవడానికి ప్రయత్నించాను. గానీ చరిత్ర మనకు ఒక కాలక్రమంగా అందుబాటులోలేదు. పైగా ప్రతి పేజీలోనూ అడ్డదిడ్డంగా ‘నైతికత, సత్ప్రవర్తన’ వంటి హితబోధలు తిష్టవేసుకుని వుంటాయి. చేసేదొకటి రాసేదొకటి.
నేను ఎలాగూ నిద్ర పోలేనుకనుక, వాక్యాల మధ్య దాగున్న పదాలను అర్ధం చేసుకోడానికి అర్ధరాత్రి వరకు చదివేవాడ్ని. పుస్తకాలన్నీ రెండే పదాలతో నిండిపోయి వుండేవి; “మనుషుల్ని తినండి!”. పుస్తకాల్లో రాసిన పదాలూ, మా కౌలుదారు మాట్లాడిన మాటలు అన్నీ నన్ను తీక్షణంగా, చిత్రంగా, ఒక కపట నవ్వుతో చూసేవి.
నేను కూడా ఒక మనిషినే. వాళ్ళు నన్ను తినాలనుకుంటున్నారు!.
4
ఈరోజు ఉదయం నా గదిలో ప్రశాంతంగా కూర్చొని వున్నాను. ముసలి చెన్ బోజనం తెచ్చాడు. ఒక గిన్నెలో కూరగాయలు, ఇంకో గిన్నెలో ఆవిరి మీద ఉడికించిన చేపలు వున్నాయి. ఆ చేపల కళ్ళు తెల్లగా వున్నాయి. వాటి నోర్లు తెరిచి వున్నాయి; అచ్చం మనుషుల్ని తినేవాళ్ళ నోరుల్లాగ. కొన్ని ముద్దలు తిన్న తరువాత గొంతు దిగుతున్నది చేపలా? మనుషుల మాంసమా? అనే అనుమానం వచ్చింది. నాకేమీ అర్ధం కాలేదు. కడుపులో దేవినట్టయి అంతా బయటికి వచ్చేసింది.
“ఇక్కడ నాకు అస్సలు ఊపిరి ఆడడంలేదు. తోటలో అలా తిరిగివస్తానని అన్నయ్యతో చెప్పు” అని ముసలి చెన్ తో అన్నాను. అతను ఏమీ మాట్లాడకుండా బయటికి వెళ్ళిపోయాడు. కాస్సేపాగి మళ్ళీ వచ్చి గేటు తెరిచాడు.
నేను కదల్లేదు. అసలు వాళ్ళు ఏమంటారో తెలుసుకోవడానికి అలా కబురు పెట్టాను. వాళ్ళు నన్ను బయటికి వెళ్లనివ్వరని నాకు తెలుసు. నేను ఊహించినట్టే మా అన్నయ్య ఓ ముసలాయన్ని వెంట పెట్టుకుని నా దగ్గరికి వచ్చాడు. అతని కళ్ళల్లో నరమాంసాహారుల చూపులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వాటిని నేను పసికట్టేస్తానేమోనన్నట్టూ మా అన్నయ్య తల వాల్చి కళ్ళజోడు కొసల్లోంచి నన్ను వాలుగా చూస్తున్నాడు.
“ఈరోజు చాలా మెరుగ్గా కనిపిస్తున్నావు” అన్నాడు
అన్నయ్య.
“అవును” అన్నాను.
“హో గారిని నేనే పిలిపించాను. నిన్ను ఒకసారి పరీక్షించాలని”
“సరే” అంటూ తలూపానుగానీ ఆ ముసలతను మారువేషంలో వచ్చిన కిరాయి హంతకుడని నాకు తెలిసిపోతూనే వుంది. ఇప్పుడు వాడు నాడి చూసే వంకతో నా చెయ్యి పట్టుకుని నా ఒంట్లో కొవ్వు ఎంతుందో చూసి వాళ్ళకు చెపుతాడు. నన్ను చంపినందుకు అతనికి నా మాంసంలో కొంత వాటా ఇస్తారు. అయినా నేను భయపడలేదు. నేను ఎప్పుడూ మనిషి మాసం తిననప్పటికీ నాకు వాళ్ళకన్నా ధైర్యం ఎక్కువే. ఏం చేస్తాడో చూద్దామని నేనూ రెండు చేతులు గట్టిగా కట్టుకుని నిలబడ్డాను. అతను కుర్చీలో కూర్చున్నాడు. కళ్ళు మూసుకున్నాడు. ఏదో గొణుక్కున్నాడు. కాస్సేపు కదలకుండా శిలలా వుండిపోయాడు. తరువాత బరువుగా కళ్ళు తెరిచాడు. “వెర్రి ఆలోచనలు మానుకో. కొన్ని రోజులు పూర్తిగా విశ్రాంతి తీసుకో. బాగైపోతావు”. అన్నాడు.
వెర్రి ఆలోచనలు మానుకొని కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలట! చంపేముందు జీవాల్ని ఇలాగే కూర్చోబెట్టి మేపుతారు. విశ్రాంతి తీసుకుంటే నాకు కొవ్వు పడుతుంది. కొవ్వు పట్టిన మాసం రుచిగా వుంటుంది. నాకు కొవ్వు పట్టితే వాళ్లకు లాభంగానీ దానివల్ల నాకు ఒరిగేదేమిటీ? బాగైపోవడం ఏమిటీ? వీళ్లంతా నా మాసం తినాలని ఉవ్విళ్ళూరుతున్నారు. ఆ విషయం బయటికి పొక్కకుండా జాగ్రత్త పడుతున్నారు. పైకి చెప్పే ధైర్యం లేదు వీళ్లకు. వీళ్ళ కపట నాటకాలు నాకు తెలిసిపోతున్నాయి. వీళ్ల అమాయికత్వాన్ని చూస్తుంటే లోపల నవ్వాపుకోలేక ఛస్తున్నాను.
నేను ధైర్యస్తుడ్ని గనుక నా మాసం అంటే వాళ్ళకు మరీ ఇష్టం. అది తింటే వాళ్ళకూ ధైర్యం వస్తుంది. వాళ్ళిద్దరూ గేటు వైపుకు నడిచారు. గేటు దాటుతుండగా ముసలతను గొంతు తగ్గించి “చటుక్కున తినేయ్యాలి” అన్నాడు. మా అన్నయ్య తలాడించాడు. అన్నయ్య కూడా ఈ ముఠాలో చేరిపోయాడన్నమాటా. ఇప్పుడు బయటపడుతున్న విషయాలు కొంచెం విభ్రాంతికరంగా వున్నప్పటికీ ఇవేవీ నేను ఊహించనివికావు. నన్ను కోసుకుని తినేవాళ్ళలో మా అన్నయ్య కూడా వుంటాడు!
మనిషి మాసం తినే మనిషి మా అన్నయ్య!
మనిషి మాసం తినే మనిషికి నేను తమ్ముడ్ని!
నన్ను ఇతరులు ఖాయంగా తినేస్తారు.
నేను మాత్రం ఏం తక్కువా?
మనిషి మాసం తినే మనిషికి స్వయాన తమ్ముడ్నేగా!
5.
ఈమధ్య కొత్త కొత్త ఆలోచనలు వస్తున్నాయి. ఆ ముసలతను నన్ను చంపడానికి మారువేషంలో వచ్చాడని నేను అనుమానిస్తున్నది తప్పు కావచ్చు. అతను నిజంగానే ఒక డాక్టరు కావచ్చు. అయినా అతను నరమాంసాహారికాడని చెప్పలేం. ఈ డాక్టర్ల గురువు లీ షీ చెన్ మూలికల మీద రాసిన పుస్తకంలో మనిషి మాంసాన్ని ఉడికించి తినవచ్చు అని రాసివుంది. నరమాంసాన్ని తినననీ ఇతను చెప్పగలడా?
ఇక మా అన్నయ్య విషయానికి వస్తే, అతన్ని అనుమానించడానికి నా దగ్గర చాలా రుజువులున్నాయి. నాకు పాఠాలు నేర్పే రోజుల్లో తను తన నోటితోనే ఒకసారి, “తిండి కోసం మనుషులు తమ పిల్లల్ని అమ్ముకుంటారు” అన్నాడు. ఇంకోసారి ఒకడితో మా అన్నయ్య తగువుపడ్డాడు. అప్పుడేమన్నాడో తెలుసా? “నిన్ను చంపితే సరిపోదురా! నీ మాంసాన్ని వండుకుని తిని, నీ తోలు పరుచుకుని పడుకున్నా తప్పుకాదు” అన్నాడు.
అప్పుడు నేను పిల్లాడ్ని. ఈ మాటలు విన్నప్పుడు నా గుండె వేగంగా కొట్టుకుంది. మా పొలాలున్న గ్రామంలో ఈమధ్య మనిషిగుండె, కార్జాన్ని తినేసిన విషయాన్ని మా కౌలుదారు చెపుతున్నప్పుడు కూడా మా అన్నయ్య కొంచెం కూడా ఆశ్చర్యపడలేదు. పైగా అదేదో సాధారణ విషయం అయినట్టు తలాడిస్తూ విన్నాడు.
తను అప్పుడు ఎంత క్రూరుడో ఇప్పుడూ అంతే క్రూరుడు. “తిండి కోసం పిల్లల్ని అమ్ముకోవడం” సాధ్యం అయినపుడు ఇంక ఎవరినయినా అమ్ముకోవచ్చు. ఎవరినయినా తినేయవచ్చు. ఇంతకు మునుపు అయితే తను ఏది చెప్పినా నేను నమ్మేసేవాడిని. నిజమే కామోసు అనుకునేవాడిని. ఇప్పటి సంగతి వేరు. మా అన్నయ్య మాట్లాడుతున్నప్పుడు అతని పెదాల కొసల్లో మనిషి కొవ్వు కనిపిస్తోంది. అతని మనసంతా మనిషి మాసం తినాలని ఉవ్విళ్ళురుతోందని నాకు తెలిసిపోతోంది.
6
కటిక చీకటి. ఇప్పుడు పగలో రాత్రో తెలీదు. ఛావో పెంపుడు కుక్క మళ్ళీ మొరుగుతోంది.
సింహపు ఉద్రేకం, కుందేలు ప్రాణభయం, తోడేలు కపటం ….
7
వాళ్ల పన్నాగం నాకు తెలుసు. వాళ్ళు ఎవర్నీ బహిరంగంగా చంపరు. అంత ధైర్యం కూడా వాళ్లకు లేదు. ఆ తరువాతి పరిణామాలు ఎలా వుంటాయో అని వాళ్లకు భయం. అంచేత వాళ్లంతా ఒక రహాస్య ముఠాగా ఏర్పడ్డారు. నన్ను నేనే చంపుకునేలా ప్రతి చోటా ఉచ్చులు అమర్చారు. వీధిలో ఆడాళ్ళూ, మగాళ్ళు కొన్నాళ్ల క్రితం ప్రవర్తించిన తీరు, కొన్ని రోజులుగా మా అన్నయ్య వ్యవహరిస్తున్న పధ్ధతి దీన్నే నిరూపిస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళు ఆశిస్తున్నదేమంటే, నేను నా నడుముకు వున్న బెల్టుతో దూలానికి ఉరేసుకోవాలనీ! అప్పుడు వాళ్ళు తమ చేతికి మట్టి అంటకుండా, తమ మీద నింద పడకుండా తమ మనసులోని కోరికను తీర్చుకుంటారు. అప్పుడువాళ్ళు సహజంగానే పట్టరాని ఆనందంతో వికటాట్టహాసం చేస్తారు. మృత్యుభయంతో మనిషి బెంగపడి చిక్కి శల్యమైపోతాడని తెలిసినా వాళ్ళు ఈ పధ్ధతినే ఎంచుకుంటారు.
వాళ్ళు శవాల మాంసాన్నే తింటారు. వికారపు చూపులతో అసహ్యంగా వుండే హైనాలు శవాల్నే తింటాయని ఎక్కడో చదివిన విషయం నాకు ఇప్పటికీ గుర్తుంది.. పెద్దపెద్ద ఎముకల్ని అది తన పళ్ళతో పటపటా కొరికి పొడి చేసేస్తుందనే మాట వింటేనే ఎవరికయినా భయంతో వణికు వస్తుంది. హైనాలు తోడేలు జాతికి చెందినవి. తోడేళ్ళు పచ్చిమాసం తినే జాతికి చెందుతాయి. ఆ రోజు ఛావో ఇంటి కుక్క నన్ను చాలాసార్లు పరికించి చూసింది. అది కూడా ఈ కుట్రలో భాగస్వామి అయ్యుంటుంది. ఈ ముఠాలో సభ్యురాలు అయ్యుంటుంది. మొన్నొచ్చిన ముసలతను కళ్ళు దించుకుని మాట్లాడినా నా కళ్ళుమాత్రం గప్పలేకపోయాడు!
అన్నింటికన్నా భాధాకర విషయం ఏమంటే మా అన్నయ్య. అతను కూడా ఒక మనిషేగా? అతనికి భయంలేదా? నన్ను తినాలని ఇతరులతో కలిసి కుట్ర చేస్తున్నాడు దేనికీ? అలవాటు పడిపోయినవాళ్ళు దాన్ని ఒక నేరంగా భావించరా? చేసేది తప్పని తెలిసినా అతను తన గుండెని రాయి చేసుకున్నాడా?
నరమాంసాహారుల్ని తిట్టాలనుకున్నా ముందుగా నేను మా అన్నయతోనే మొదలెట్టాలి. నరమాంసాహారుల్ని సన్మార్గంలో పెట్టాలన్నా ముందుగా నేను మా అన్నయతోనే మొదలెట్టాలి.
8
నిజానికి నాలాంటి ఆలోచనలు వచ్చివుంటే వాళ్ళు ఏనాడో మారిపోయివుండేవారు.
ఇంతలో నా గదిలోనికి ఎవరో వచ్చారు. అతనికి ఇరవై యేళ్ళు వుంటాయేమో. అతని ముఖకవళికలు నాకు స్పష్టంగా కనిపించడంలేదు. ముఖానికి చిరునవ్వు ముసుగు వేసుకున్నాడు. నావైపు చూసినపుడు ఆ నవ్వులో ఏమాత్రం జీవంలేదని తెలిసిపోతోంది.
“మనుషుల్ని తినడం సరైనదేనా?” అని అడిగాను.
నా మాటలకు అతను కంగారు పడలేడు. పైగా నవ్వుతూనే ఎదురు ప్రశ్న వేశాడు; “కరువుకాటకాలు లేనపుడు ఎందుకు తింటారూ?”.
అప్పుడు నాకు అర్ధం అయిపోయింది. కరువు కాటకాలు వచ్చినపుడు మనుషులు మనుషుల్ని తింటారనేగా అతను చెప్పింది?. అతను ఆ ముఠాలో సభ్యుడే. అయినా నేను ధైర్యాన్ని కూడగట్టుకుని మళ్ళీ అదే ప్రశ్న వేశాను.
“ఎప్పుడయినా సరే అది సరైనదేనా?”
“నీకు ఇలాంటి సందేహాలు ఎందుకు వస్తున్నాయీ?. నువ్వు చాలా చిత్రమైన మనిషివి. పరాచకాలు ఆడుతున్నావు. ఇటు చూడు
ఈ రాత్రి ఎంత బాగుందో?”
“బాగుంది. చంద్రుడు కూడా ప్రకాశవంతంగా వున్నాడు.
కానీ నేను నిన్ను ఒక ప్రశ్న వేశాను; “అది సరైనదేనా?”
అతను ఇరకాటంలో పడ్డాడు. ఇబ్బందిగా గొణుక్కుంటున్నాడు. “కాదు” అన్నాడు.
“కాదా? మరి వాళ్ళు ఇంకా దాన్నెందుకు కొనసాగిస్తున్నారూ?”
“నువ్వు దేనిగురించి మాట్లాడుతున్నావూ?”
“నేను ఏం మాట్లాడుతున్నానా?” మా పొలాలున్న గ్రామంవాళ్ళు మనుషుల్ని తింటున్నారు. మనం చదివే పుస్తకాలు అన్నింట్లో ఈమాటలు ఎర్రటి తాజా ఇంకులో రాసున్నాయి. నువ్వూ చూడవచ్చు”
అతని కవళికలు మారిపోయాయి. ముఖం భయంకరంగా పాలిపోయింది. “కావచ్చేమో”
అన్నాడతను నావైపు తీక్షణంగా చూస్తూ. “అది ఎప్పటి నుంచో వున్నదేగా” అన్నాడు.
“ఎప్పటి నుంచో వుందిగాబట్టి, అది సరైనది అయిపోతుందా?”
“ఇలాంటి విషయాలు నీతో చర్చించడం నాకు ఇష్టంలేదు. నువ్వూ వీటిని గురించి మాట్లాడకపోవడమే మంచిది. వీటి గురించి ఎవరు మాట్లాడినా తప్పే” అన్నాడు.
నేను ఒక్కసారిగా ముందుకు దూకి కళ్ళు పెద్దవి చేసి చూశాను. అప్పటికే అతను అదృశ్యమైపోయాడు. నేను ముచ్చెమటలో తడిసి ముద్దయిపోయాను. మా అన్నయ్యకన్నా అతను చాలా చిన్నవాడు. అయినప్పటికీ ఆ ముఠాలో చేరిపోయాడు. అతని తల్లిదండ్రులే అతనికి నేర్పించి వుంటారు. వీళ్లంతా ఈపాటికి
ఇదంతా ఊర్లో పిల్లలకు నేర్పించేసి వుంటారని నా భయం. అందుకేగా ఆ పిల్లలు కూడ నాకేసి అంత భీకరంగా చూస్తున్నది.
9
ఇతరుల్ని తినాలనే కోరిక మనకు బలంగా వున్నప్పుడు ఇతరులు మనల్ని తినేస్తారనే భయమూ తీవ్రంగానే వుంటుంది. ఎదుటివాళ్ళు తమను తినేస్తారనే భయం మనుషుల్ని నిరంతరం వెంటాడుతూ వుంటుంది.
ఇలాంటి భయాలతో సతమతమయ్యే మనుషులు ప్రశాంతంగా జీవించగలరా? పనిచేయగలరా? నడవగలరా?
తినగలరా? పడుకోగలరా? వాళ్ళు నిర్ణయించుకోవాల్సింది ఒక్కటే; మనుషుల్ని మనుషులు తినకూడదని. అయితే, తండ్రులు-కొడుకులు, మొగుళ్ళు-పెళ్ళాలు, సోదరులు-స్నేహితులు, గురువులు-శిష్యులు, చిరకాల శత్రువులు-అపరిచితులు అందరూ ఈ కుట్రలో భాగమైపోయారు. దీనిని
ప్రశ్నించేవారిని హేళన చేసి అడ్డుకుంటున్నారు.
10
ఈరోజు ఉదయాన్నే నేను మా అన్నయ్య దగ్గరికి వెళ్ళాను. అతను హాలు డోరుకు అవతల నిలబడి ఆకాశం కేసి చూస్తున్నాడు. నేను వెళ్ళి డోరుకు ఆవల మా అన్నయ్య వెనక నిలడ్డాను.
ఎన్నడూ లేనంత ప్రశాంతంగా, ఎంతో మర్యాదగా : “అన్నయ్యా! నీకో విషయం చెప్పాలి” అన్నాను.
అన్నయ్య నా వైపు తిరిగి, “చెప్పు. ఏంటది?” అంటూ తలాడించాడు.
“చాలా చిన్న విషయమేగానీ, చెప్పడానికి నేనే కొంచెం ఇబ్బంది పడుతున్నాను. బహుశ ఆదిమ మానవులందరూ మనిషిమాసం తినేవారనుకుంటాను. తరువాతి కాలంలో అభిప్రాయాలు మార్చుకుని మంచి ప్రవర్తన అలవర్చుకున్నవాళ్ళు నరమాసం తినడం మానేసి వుంటారు. వాళ్ళు మనుషులుగా, అంటే మంచిమనుషులుగా మారివుంటారు. కొందరు ఇప్పటికీ నరమాంసం తింటూ వుండవచ్చు సరీసృపాల్లాగా! తొలి జీవుల్లో కొన్ని చేపలు, పక్షులు, కోతులుగా మారి చివరకు మనుషులుగా మారాయి. కొన్ని జీవులు అలా మంచిగా మారదలచలేదు. అవి ఇప్పటికీ సరీసృపాలుగా వుండిపోయాయి. కోతుల ముందు సరీసృపాలు సిగ్గుపడుతున్నట్టు, మనుషుల్ని తిననివాళ్ళ ముందు తినేవాళ్ళు అంతకన్నా ఎక్కువ సిగ్గు పడాలి” అని ఆగాను.
కొంచెం ఊపిరి తీసుకుని మల్ళీ మొదలెట్టాను. “పురాతన కాలంలో ఛియే, ఛౌలకు విందు ఇవ్వడానికి యీయా తన కొడుకును కోసి వంట చేశాడు. అది పురాణగాథ. నిజానికి పాన్ కూ స్వర్గాన్నీ, భూమినీ సృష్టించినప్పటి నుండీ మనుషులు ఒకరినొకరు చంపుకు తింటూనేవున్నారు. యియా కొడుకు కాలం నుండి హుసు హుసిలిన్ కాలం వరకూ, హుసు హుసిలిన్ కాలం నుండి మన పొలంవున్న గ్రామంలో నిన్నమొన్న ఆ మనిషిని చంపుకుని తిన్నంత వరకూ ఈ సాంప్రదాయం కొనసాగుతూనే వుంది. వాళ్ళు గతేడాది పట్టణంలో ఓ నేరగాణ్ణి తల తీసేశారు. అతని రక్తంలో రొట్టె ముక్కను ముంచుకుని తలారి తినేశాడు”. నేను మళ్ళీ ఆగాను. మా అన్నయ్యలో చలనం లేదు.
“వాళ్ళు నన్ను తినాలనుకుంటున్నారు. ఇది తథ్యం. ఇందులో నువ్వొక్కడివే చేయగలిగింది కూడా ఏమీలేదు. కానీ, నువ్వు ఆ ముఠాలో ఎందుకు చేరిపోయావూ? వాళ్ళు నరమాంస భక్షకులు. ఏమయినా చేగలరు. వాళ్ళు నన్ను తినగలిగినపుడు రేపు నిన్ను కూడా తినేయ్యగలరు. ఆ ముఠా సభ్యులు ఇప్పటికీ ఒకరినొకరు తినేస్తున్నారు. నువ్వు కనుక తక్షణం నీ పధ్ధతుల్ని మార్చుకుంటే అందరం ప్రశాంతంగా వుండవచ్చు. ఇది ఆనాదిగా సాగుతున్నదే అయినప్పటికీ ఒక మనిషిని మరో మనిషి తినే సాంప్రదాయాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించి చిత్తశుధ్ధితో ప్రయత్నిస్తే మనమంతా మంచిగా మారవచ్చు. ఇది నువ్వు చేయగలవనే నమ్మకం నాకుంది అన్నయ్యా! మొన్న మన కౌలుదారుడు కౌలు తగ్గించమని అడిగినపుడు నువ్వు అలా చేయడం సాధ్యం కాదన్నావు”.
మా అన్నయ్య ఏమీ పట్టనట్టు ఓ చిరునవ్వు నవ్వాడు. అతని కళ్ళు హంతకునిలా నిప్పులు చెరుగుతున్నాయి. వాళ్ల రహాస్యాన్ని నేను బయటపెట్టేయడంతో అతని ముఖం పాలిపోయింది.
గేటు బయట జనం గుమిగూడారు. ఛావో, అతని కుక్క కూడా అక్కడికి చేరారు. అందరూ కొంగలా మెడలు సాగదీసి మా మాటల్ని వింటున్నారు. అందరూ దుప్పట్లు కప్పుకున్నప్పటికీ వాళ్ళ ముఖాల్ని నేను స్పష్టంగా చూడగలుగుతున్నాను. వాళ్ళల్లో కొందరు పాలిపోయి దెయ్యాల్లా వున్నారు. ఎగబడి వస్తున్న నవ్వుని బిగబట్టి నిలబడ్డారు. వాళ్లంతా ఒకే ముఠాసభ్యులని నాకు తెలుసు. అందరూ మనిషి మాంసాన్ని తినేవాళ్ళే. అయితే వాళ్ళంతా ఒకేలా ఆలోచిస్తున్నారని నేను అనుకోను.
అనాదిగా వస్తున్న ఆచారం గాబట్టి, తాము కూడా సాటి మనుషుల్ని తినకతప్పదని వాళ్ళలో కొందరు అనుకుంటున్నారు. వాళ్లల్లో మరికొందరికి మనుషుల్ని తినకూడదని తెలిసినా తినేస్తున్నారు. వాళ్ల రహాస్యాన్ని ఎవరైనా కనుక్కుంటారని వాళ్లకు భయం. అందుకే నా మాటలు విన్నప్పుడు వాళ్ళకు కోపం వచ్చింది. అయినా వాళ్ళు చిరునవ్వు నవ్వుతూ నిలబడ్డారు. పెదాలను అదిమిపట్టి, అనుమానపు చూపులతో నవ్వడం వాళ్ళకు అలవాటే.
మా అన్నయ్య హఠాత్తుగా భీకరంగా మారిపోయి గట్టిగా అరిచాడు.
"పొండి మీరంతా ఇక్కడ నుండి. ఒక పిచ్చొడ్ని అలా చూస్తూ నిలబడితే ఏమొస్తుందీ?"
అప్పుడు నాకు వాళ్ల కుట్ర మరింతగా అర్ధం అయింది. వాళ్ళు మారడానికి ఎప్పటికీ సిధ్ధపడరు. ప్రతిచోటా వాళ్ళు ఉచ్చులు పరిచి వుంచారు. పిచ్చివాడని ముద్రవేసి నన్ను పక్కన పెట్టారు. రేపు నన్ను తినేసినప్పుడు వాళ్ళను తప్పుపట్టేవాడు వుండడు. బహుశ కొందరు వాళ్లని మెచ్చుకుంటారు కూడ. గ్రామస్తులు ఓ దుర్మార్ఘుడ్ని తినేశారని మా కౌలుదారుడు చెప్పినపుడు కూడా ఇలాంటి వ్యూహాన్నే పన్నారు. ఇది వాళ్ల పాత చిట్కానే.
ముసలి చెన్ ఆవేశంగా లోపలికి వచ్చాడు. అయినా నేను వెనక్కు తగ్గలేదు. నేను వాళ్ళతో మాట్లాడాలి :
“మీరు మారాలి. మీ హృదయాంతరాళాల్లోంచి మారాలి. మీరు ఒక విషయాన్ని తెలుసుకోండి. భవిష్యత్తులో నరమాంసాహారులకు ఈ ప్రపంచంలో స్థానం వుండదు”.
“ఇప్పటికీ మారకపోతే మీరంతా ఒకరినొకరు తినేసి అంతమైపోతారు. మీలాంటివాళ్ళు మరికొందరు పుట్టవచ్చు. తోడేళ్లను, సరీసృపాలనూ వేటగాళ్ళు చంపేసినట్టు వాళ్లను నిజమైన మానవులు తుడిచిపెట్టేస్తారు.
ముసలి చెన్ జనాన్ని దూరంగా తోలేశాడు. మా అన్నయ్య అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ముసలి చెన్ నన్ను నా గదిలోనికి వెళ్ళిపోమ్మన్నాడు.
గదిలో కటిక చీకటిగా వుంది. నా తల మీదున్న దూలాలు, స్థంభాలు వూగుతున్నాయి. అలా కాస్సేపు ఊగి అవి పెద్దవయిపోయాయి. అవన్నీ నా మీద పడిపోయాయి. అవి చాలా బరువుగా వున్నాయి. నేను కదలలేకపోతున్నాను. నేను చావాలనే వాళ్ళు ఇదంతా చేస్తున్నారు. ఈ బరువు నాకేమీ లెఖ్ఖలోనిదికాదు. వాటిని పక్కకు తోసేయడానికి నేను పెనుగులాడాను. ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. అయినా నేను ఎలుగెత్తి చెప్పక తప్పదు :
“మీరు మారాలి. మీ హృదయాంతరాళాల్లోంచి మారాలి. మీరు ఒక విషయాన్ని తెలుసుకోండి. భవిష్యత్తులో నరమాంసాహారులకు ఈ ప్రపంచంలో స్థానం వుండదు”.
11
నా గదిలోనికి సూర్యుడు వెలుగు నివ్వడంలేదు. తలుపులు తెరుచుకోవడంలేదు. ప్రతిరోజూ రెండుసార్లు భోజనం వస్తోంది. అంతే.
నేను చోప్ స్టిక్స్ తీసుకుని మా అన్నయ్య గురించే ఆలోచిస్తున్నాను. నాకు తెలుసు నా చిట్టి చెల్లెలు ఎలా చనిపోయిందో. అంతా అతనే చేశాడు. అప్పుడు మా చెల్లి వయస్సు ఐదేళ్ళు. తను సున్నిత మనస్కురాలు. ఎంత ప్రేమాస్పదంగా వుండేదో ఇప్పటికీ నాకు గుర్తు. మా అమ్మ ఏడ్పు ఆపుకోలేకపోయింది. ఏడ్వవద్దని మా అన్నయ్య బతిమిలాడాడు. బహుశ మా చెల్లెల్ని తనే తినేసి వుంటాడు. మా అమ్మ ఏడుస్తుంటే వాడికి సిగ్గేసి వుంటుంది. అలాంటి వాళ్లకు సిగ్గంటూ వుంటే ...
మా చెల్లెల్ని మా అన్నయ్య తినేశాడు. మా అమ్మకు ఆ విషయం అర్ధం అయిందోలేదో నాకు తెలీదు.
మా అమ్మకు కూడా తెలిసే వుంటుందని నేను అనుకుంటున్నాను. కానీ ఆమె ఏడుస్తున్నప్పుడు ఒక్కసారి కూడా ఈ విషయాన్ని బయటికి చెప్పలేదు. అది సమంజసమేనని ఆమె కూడా అనుకుని వుండవచ్చు.
నాకు నాలుగైదేళ్ల వయసున్నప్పుడు ఇంకో సంఘటన జరిగింది. నేను చల్లటి చావిట్లో కూర్చొని వున్నాను. అప్పుడు మా అన్నయ్య నాకో హితబోధ చేశాడు. తల్లిదండ్రులకు జబ్బుచేసినపుడు పిల్లలు తమ వంట్లో మాంసాన్ని కోసి వుడికించి వాళ్లకు పెట్టాలట. అది విని మా అమ్మ ఊరుకుందిగానీ అన్నయ్య మాటల్ని ఖండించలేదు. మనిషి మాంసాన్ని ఒక ముక్క తినవచ్చు అనుకున్నప్పుడు మొత్తం మనిషిని కూడా తినవచ్చనేగా అర్ధం. ఆ దారుణాన్ని గుర్తు చేసుకుంటేనే చాలు ఇప్పటికీ నా హృదయం నుండి రక్తం కారుతుంది. అదే ఇందులోవున్న విశేషం.
12
ఈ ఆలోచనల్ని నేను భరించలేకపోతున్నాను.
నాకిప్పుడు అర్ధం అయినదేమంటే నాలుగు వేల సంవత్సరాలుగా నరమాసం తింటున్న మనుషుల మధ్య ఇన్నాళ్ళుగా నేను బతుకుతున్నాను. మా చెల్లి చనిపోయిన తరువాత మా ఇంటి పెత్తనం అంతా మా అన్నయ్య తీసేసుకున్నాడు. బహుశ అతను మాకు తెలీకుండా ఆమె మాంసాన్ని మేము తినే అన్నం కూరల్లో కలిపేసి వుంటాడు.
నాకు తెలీకుండానే మా చెల్లెలి మాసం ముక్కల్ని నేను లొట్టలేసుకుని తినేసి వుంటాను. ఇప్పుడు నా వంతు వచ్చేసింది.
మొదట్లో ఆ విషయం నాకు తెలీకపోవచ్చు. గానీ, మనుషుల్ని మనుషులు తినే సాంప్రదాయం నాలుగు వేల సంవత్సరాలుగా కొనసాగుతోందని ఎంతోకొంత చరిత్ర తెలిసిన నాలాంటివాడు ఎవడయినా మనిషిమాంసం తినని మనిషిని ఎప్పుడయినా చూడగలనని ఆశించగలడా?
13
మనిషి రక్తం రుచిమరగని పిల్లలు ఇప్పటికీ కొందరు వుండవచ్చు;
పిల్లల్ని కాపాడడండి!
----- ---- // ------
(స్వీయ రచన చేసినంత సులువుకాదు అనువదించడం. అనువాదానికి అనేక అదనపు దినుసులు కావాలి. అనువదిస్తున్న అంశం మీద ముందు మనకు గొప్ప ఆసక్తి అభిమానం వుండాలి. వేరే భాషలో చదివి మనం పొందిన ఒక గొప్ప అనుభూతిని మన భాషలో మరొకరితో పంచుకోకుండా వుండలేనంత తపన వుండాలి. గమ్య భాషతోపాటు, మూల భాష రీతి సాంప్రదాయాలు సమయ సందర్భాలు తెలుసుండాలి.
చిక్కగా, క్లుప్తంగా రాయడంలో (Brevity) లూసన్ అగ్రగణ్యుడు. లూసన్ వాక్యాలను అనువదిస్తున్నపుడు కొన్నిచోట్ల కొన్ని పదాలను అదనంగా వాడకతప్పలేదు. - డానీ)
3 మార్చి 2015

.png)
.png)
.png)
Comments
Post a Comment