Abhijataalu

*సహజాతాలు*

 

*కథ బీయస్ రాములు*

*కథనం ఉషా యస్ డానీ* 

1987 సెప్టెంబరు నాటి సంగతి. కరీంనగర్, ఆదిలాబాదు రైతాంగ సాయుధపోరాటాల నేపథ్యంలో ఒక కథ రాయాలని నాకు అనిపించింది. రచయిత బీయస్ రాములు (అప్పుడు ప్రభాకర్ పేరుతో వున్నాడు) ఓసారి నాతో ఓ పోరాట సంఘటన చెప్పాడు. ఆ లీడ్ పట్టుకుని అవసరమైన భావోద్వేగాలు ఇతర సరంజామా  జోడించి నేను ఒక కథగా మలిచాను. నా గోదావరి శైలి తెలుగు రాములుకు నచ్చలేదు. తను నా కథనాన్ని ఇదే శీర్షికతో తెలంగాణ శైలిలో తిరగరాశాడు. అప్పట్లో ఏలూరి అజిత సంపాదకత్వంలో కొంతకాలం నడిచిన  ‘సమీక్ష’ మాస పత్రికలో  ప్రభాకర్ వెర్షన్ ను ప్రచురించాము. నా వెర్షన్ అప్పటి నుండి అముద్రితంగా వుండిపోయింది. అంచేత దీన్నికథ బీయస్ రాములు, కథనం డానీ’ అనుకుంటే సమంజసంగా వుంటుంది. 

ఇక చదవండి.

మీ అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెప్పండి. 

 


*అభిజాతాలు*

 

వాళ్ళిద్దరు.

బాబూ, శీనూఅప్పూ, చిరుకొండడుల్లా.

వాళ్లను చూసి ఆర్నేల్లయింది.

కళ్ళలో ఎంత ఆత్మ విశ్వాసం!

నాలుగు కళ్ళు నన్నుఆర్నెల్లుగా వెంబడిస్తూనే వున్నాయి.

గుచ్చిగుచ్చి ప్రశ్నలవర్షం కురిపిస్తూనే వున్నాయి.

 

సాయంత్రం కాలేజీ నుండి తిరిగి వచ్చాక చూశానా ఉత్తరాన్ని.

ఎవరో ఖైదీ రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి రాశాడు.

ఉత్తరం నిండా అవేకళ్ళు. అవే చూపులు. అవే ప్రశ్నలు.

 

వాళ్ళిద్దరూ నా శిష్యులు. నేను వాళ్లకు గురువును అవునోకాదో నాకు తెలీదు. అయినా వాళ్ళు నా శిష్యులు. అవును నా శిష్యులు.

 

నేను పక్కూరి హైస్కూలులో పనిచేసినపుడు అక్కడే వాళ్ళు టెన్త్ చదివేరు. నేను కరీంనగర్ కాలేజీలో  లెక్చరర్ గా మారేక ఇక్కడే వాళ్ళు ఇంటర్ లో చేరేరు.

 

చిరస్మరణ నవల చదివి ఐదేళ్లయింది. వాళ్ళ ప్రస్తావన వచినప్పుడెల్లా అప్పూ, చిరుకొండడ్లే నా కళ్ళ ముందు కదలాడుతుంటారు. నాకు   నవల తెచి ఇచ్చింది వాళ్ళే. దాని మీద ఏదో వాళ్ళ విద్యార్ధి సంఘం లైబ్రరీ ముద్ర వుంది. అది చూసి పుస్తకాన్ని గిరవేవాటేశాను.

 

అప్పట్లో నేనుశాఖ’లో వుండేవాడ్ని.  వాళ్ల విద్యార్ధి సంఘానికీ మాకూ చుక్కెదురు. అలాగని వాళ్ళిద్దరితో సంబంధాన్ని తెంచుకోలేదు. అది నా వల్ల కాలేదు. దానికి కారణం మా ఆవిడ.

 

వాళ్ళిద్దరిదీ మా ఆవిడదీ ఒకే ఊరు. వాళ్ల అక్కలు ఇద్దరూ మా ఆవిడకి చిన్ననాటి స్నేహితురాళ్ళు. దాంతో ఆమె వాళ్లనిఅరేయ్ తురేయ్ అని పిలిచేది.  రానురానూ పట్నంలో మా ఆవిడ వాళ్లకు సొంత అక్కయిపోయింది. మా పిల్లలకు జలుబుచేసి ఆసుపత్రికి తీసుకెళ్ళినా వాళ్ళే, చివరకు మా ఆవిడ ఆపరేషను చేయుంచుకుని హాస్పిటల్ లో వున్నా వాళ్ళే.

 

వాళ్ళ ప్రపంచం వేరు. అది నాకు నచ్చేదికాదు.  నా బలహీనత ఏమిటో అర్ధంకాదు. ఎందుకో వాళ్లను మినహాయించి మా ఇంటిని ఊహించడం నాకే సాధ్యం అయ్యేదికాదు. వాళ్ల ఎప్రోచ్ లోనే ఏదో మహత్యం వుంది. దాన్ని ఎదిరించలేకపోయా. లొంగిపోయా. చివరకుచిరస్మరణ చదవక తప్పలేదు.

 

అందులో మాస్టారు పాత్రను చదువుతుంటే ఒళ్లంతా చీమలు కుట్టినట్టుగా వుండేది. నాలా హాయిగా ఉద్యోగం చేసుకోక ఇదేం పాడు జబ్బు అనిపించేది.

 

లోకంలో మనం గొప్ప పనులు చెయ్యకపోయినా ఇబ్బందేమీ వుండదు. కానీ, మనలాంటోడు మనతో సంబంధం లేకుండా గొప్పగొప్ప పనులు చేసేస్తుంటే చాలా ఇబ్బందిగా వుంటుంది.

 

నవల చదివేక ఇక రాత్రి నిద్రపడితే ఒట్టు. ఒళ్లంతా ఉక్కబోసేసినట్టు అయిపోయింది. ఎవరిదో పరాయి శరీరంలో నేను బతికేస్తున్నానేమో అనిపించింది. మూడు రోజులు మామూలు మనిషి కాలేకపోయా. దాని ప్రభావం అంతా ఇంతా కాదు. అదంతా చివరకు వీళ్ళిద్దర్నీ అభిమానించడంగా మారిందని  చాలా ఆలస్యంగా అర్ధం అయింది.

 

ఏడు నెలల క్రితం వాళ్లను అరెస్టు చేశారు. పట్టపగలు నడిరోడ్డు మీద. చాలా మంది చూశారు. అలా చూసినవాళ్లకు కళ్ళుండవని పోలీసులకు గట్టి  నమ్మకం. ఎందుకోగానీ పోలీసుల నమ్మకాన్ని ఎవరూ వమ్ము చేయలేదు.

 

రెండు రోజుల తరువాత వాళ్ల అరెస్టు వార్త నాకు తెలిసింది. తెలిసినా నేను చెయ్యగలిగిందేమీ లేదు. ‘శాఖలో వున్న రోజుల్లో పోలీసు స్టేషన్లో కాస్త పరపతి వుండేది. అప్పటి పరిస్థితి వేరు. మరి ఇప్పుడోవాళ్లను చూడడానికి పోలీసు స్టేషనుకు వెళ్లడం అంటే కోరికోరి చావును కొనితెచ్చుకోవడమే. నాకా తెగువ లేదు.

 

వాళ్ల తల్లిదండ్రులు స్టేషనుకు వెళ్ళేరట. వాళ్లనూ తన్ని తగలేసి వారం రోజులు లాకప్పులో వుంచి పంపించారట.  

 

నెల రోజుల తరువాత అనుకుంటాను వాళ్ళిద్దరూ ఎవర్నో హత్య చేసినట్టూ, మరింకెవరి ఇంట్లోనో దొంగతనం చేసినట్టూ తప్పుడు కేసులుపెట్టి సబ్ జైలుకు పంపేరు.

 

సబ్ జైలు గుడ్డిలో మెల్ల కనుక ధైర్యం చేసి వెళ్ళి కలుసుకున్నా. జైల్లో ప్రవేశించగానే ఎందుకో ప్రాణం ఝల్లుమంది. ఏవేవో అడగాలనుకున్నా. నోరు పెగల్లేదు. వాళ్ళిద్దరూ కటకటాల్లోపల శవాల్లా పడున్నారు. శరీరాలు నల్లగా కమిలిపోయాయి. లాఠీదెబ్బలు పెద్దపులి చారల్లా చర్మంపై అతుక్కుపోయాయి. చారల మధ్య పుళ్లయి నెత్తురు కారుతోంది. అట్టకడుతున్న నెత్తుటి మీద ఈగలు వాలుతున్నాయి. 

 

నేను వచ్చినట్టు గమనించి ఎవరో వాళ్లను తట్టిలేపారు. వాళ్ళళో కదలిక లేదు.  నిదానంగా కళ్ళు తెరిచారు.

 

ఎంత ఆశ్చర్యం. కళ్లళ్ళో ఎక్కడా దీనత్వంలేదు. అవి ఎంత స్వఛ్ఛంగా నిర్మలంగా వున్నాయనీ!  వాళ్ళకూ తెలుసు ఇలాంటిది ఎప్పుడో ఒకప్పుడు తప్పదని. వాళ్ల దేహాలు బాధను తట్టుకోలేక గిలగిల లాడాయేమోగానీ, వాళ్ళ విశ్వాసం చెదరలేదు. అందుకు నాలుగు కళ్ళే సాక్ష్యం.

 

వాళ్ళు లేచి కటకటాల దగ్గరకు వచ్చారు. నా ఆలస్యానికి క్షమాపణలు కోరుకోవాలనుకున్నా. అప్పటికీ నోరు పెగలలేదు. ఏదో చెప్పబోయి తలదించుకున్నాను. వాళ్ళు అంతా పసికట్టేసినట్టున్నారు. వాళ్లకంతా అర్ధం అయిపోయినట్టుంది. ఒక సన్నని చిరునవ్వు నవ్వేరు. నాకు అప్పుడే మొదటిసారిగా తోచిందివాళ్ళు నాకన్నా ఎంతో ఎత్తుకు ఎదిగిపోయారనీ.

 

శీను మా ఆవిడ గురించీ మా పిల్లల గురించీ అడిగేడు. బాబు వాడి పక్కని నిలబడి వింటున్నాడు. నేను వాళ్లను పరామర్శించడానికి వెళ్ళానో  వాళ్ళు నన్ను పరామర్శిస్తున్నారో కాస్సేపు అర్ధం కాలేదు.

 

శిష్యుల్ని చూడ్డానికికదా నేను వెళ్ళిందీ?  నా స్నేహితుల్ని కలిసినట్టుగా వుండింది. ఆత్మీయుల్ని చూసినట్టుగా వుండింది.  నాలోని ఉపాధ్యాయుడు కరిగిపోయి వాళ్ళ శిష్యుడిగా మారిపోతున్నట్టు అనిపించింది.

 

చివరకు ధైర్యం చేసి  సమాధానం తెలిసిన ప్రశ్నే అడిగాను; “కొట్టేరా?” అని.

దాందేముందిలెండి. మామూలే! అన్నాడు శ్రీను.

మేమేమీ తక్కువ తినలేదు మాస్టారూ!” అన్నాడు బాబు ఉత్సాహంగా. అతని కళ్ళల్లో మెరుపు మరింత తళతళ లాడింది.

ఏం చేసేరేంటీ?”

చంద్రన్న జాడ చెప్పమన్నారు. సరే చూపెడతాం అని రాత్రేళ తీసుకుని వెళ్ళాం.” అన్నాడు శ్రీను.

ఎక్కడికి అనుకున్నారూ?” సమాధానం ఆశించకుండానే అడిగాడు బాబు. అతని కళ్ళు వ్యంగ్యంగా మెరిసేయి.

వరంగల్సిధ్ధిపేట రోడ్డులో హుస్నాబాద్ ఇవతల రత్నగిరి కొండలు లేవూ? అక్కడికి!” తార్రోడెంట కాదు; అడ్డదారుల్లో తీసుకువెళ్ళేం.  రాత్రంతా కొండల్లో, గుట్టల్లో, తెగతిప్పేం వాళ్ళని. తాగేసున్నారు. అప్పుడు తెలియలేదు. కంపల్లో తిరిగి తిరిగి తెల్లారే సరికి ఒళ్లంతా గీరుకుపోయింది వెధవలకి. అన్నాడు శ్రీను.

 

చేన్ల కావలికి మంచెకాడ పట్టుకున్న లాంతర్లను దూరం నుండి చూసి తెగ భయపడిపోయారు నాయాళ్ళు. ఐదొందల మంది కాగడాలు పట్టుకుని దాడికి వచ్చేస్తున్నారనుకుని బిక్కచచ్చిపోయారు. ఇక పరుగే పరుగునవ్వుతూ చెప్పుకుపోయాడు బాబు.

 

తెల్లారేసరికి పోలీసు స్టేషన్ కాస్తా హాస్పిటల్ లో ఎమర్జెన్సీ వార్డుగా మారిపోయింది. కానిస్టేబుళ్ల దగ్గరి నుండి డీయస్పీ వరకు అందరికీ ఒంటి నిండా బ్యాండేజీలే  అన్నాడు శ్రీను.

 

మిమ్మల్ని మళ్ళీ కొట్టారేమో?”

కొట్టారనుకోండీ. అయినా వాళ్ళు మనకు పది ట్రీట్ మెంట్లు ఇస్తే మనం ఒక్కటయినా ఇవ్వకపోతే ఏం బాగుంటుందీ? ఇచ్చేసేం. అంతే!” – బాబు చెపుతుంటే శీను నవ్వుతూ నిలబడ్డాడు.

 

లేకపోతే తన్నేసేరని చంద్రన్న జాడ చెప్పేస్తామా మాస్టారూ?”

 

శీను మాటల్లో వ్యంగ్యంకన్నా సమయంలోనూ శత్రువును ముప్పుతిప్పలు పెట్టగలిగామనే సంతృప్తే వుంది. ఆధోరణే నన్ను మరింత ఆకట్టుకుంది.

 

తరువాత వాళ్లను రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపించేసేరు.

 

వాళ్ళు నా శిష్యులు. నా మీద వాళ్ళు  చూపే అమిత గౌరవం ఇబ్బందిగా వుంటుంది.  వాళ్ళ చూపుల వెనుక ఎక్కడో ఒక సందేహం కనిపిస్తూ వుంటుంది; “మీరు మాకు గురువే కదా? అని. గురువునని చెప్పాలనే నా తాపత్రయం కూడ. శిష్యులకేం కరువూ? ఉపాధ్యాయ వృత్తిలో బోలెడుమంది దొరుకుతారు. కానీ అలాంటి శిష్యులు దొరకడం నిజంగా వరం. నాకొచ్చిన అవకాశాన్ని పోగొట్టుకో దలచలేదు. చివరకు వాళ్ల గురువుగా ఎదగదలచుకున్నా.

 

మనిషిగా ఎదగడం వయసులో ఎదిగినంత, చదువులో ఎదిగినంత సులువుకాదు.

నేను వాళ్ల గురువుగా ఎదగడానికి ప్రయత్నం చేసేకొద్దీ నా పాత స్నేహితులు దూరం అయిపోయారు. కొందరు ముఖం మీదే తిట్టేరు. కొందరు అయ్యోపాపం అన్నారు. కొందరు బంగారంలాంటి జీవితాన్ని పాడుచేసుకోకు అన్నారు. కాలేజీ కరస్పాండెంట్ సస్పెండ్ హెచ్చరికలు చేశాడు. అంతెందుకూ శీనూ, బాబుల్ని అంతగా అభిమానించిన మా ఆవిడ వారం క్రితం మా పెడ్డాడ్ని నా ముందే చావ బాదింది.  వాడి ప్యాంటు మీద జేగురు రంగు మరకలు వున్నాయట. వాల్ రైటింగుకు వెళ్ళినట్టు పసిగట్టింది.

 

మరోసారి మరోసారీ.

పదోసారి ఉత్తరం చదివా.

 

జైలు మాన్యువల్ ను అమలు చేయాలనీ, కనీస సౌకర్యాలు కల్పించాలనీ ఖైదీలు సమ్మె చేశారట. శ్రీను, బాబు పదిరోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారట.  వాళ్లను లేపెయ్యడానికి వార్డెన్లు లాఠీచార్జి చేశారట. స్పృహతప్పి పడిపోతే ఇద్దర్నీ హాస్పిటల్ లో చేర్పించారట. వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా వుందట.

 

ఉత్తరం చదివిన దగ్గర నుండి మా ఆవిడ ఒకటే ఏడుపు. ఏమిటో జీవిత ద్వంద్వం. ఆదర్శాలకూ బతుకుతెరువుకూ మధ్య చెలగాటం.

 

వాళ్లను బతికించుకోవాలి. వాళ్ళు నన్ను చూసే చూపుల వెనక దాగున్న సందేహానికి అభయం ఇవ్వాలి. ఒక్కసారి వాళ్ల ముందు నిలబడి నిజంగా నేను మీ గురువునే అనగలగాలి.

 

వాళ్ల వూరు వెళ్ళి, వాళ్ళ తలిదండ్రుల్ని తీసుకుని వెంటనే రాజమండ్రి వెళ్ళాలనుకున్నా. వెంటనే బయలుదేరమంటూ మా ఆవిడ ఒకటే తొందర పెడుతోంది. పెద్దాడ్ని పిలిచి, “అప్పుడు వద్దాన్నా వెళ్ళావు కదరా. అదేదో వాల్ రైటింగులు ఇవ్వాళ రాయరాదూ?” అంది.

 

ఇవ్వాళ నాకు ప్రపంచాన్ని జయించినంత గర్వంగా వుంది.  ప్రపంచాన్ని జయించడం అంటే మనిషి తనను తాను జయించడమే అని నాకు ఇవ్వాళే తెలిసింది.

 

గబగబా వీధిలోకొచ్చి బస్ స్టేషన్ దారి పట్టాను.

కాకూడనిదేదో జరిగితే వాళ్ల ప్రయాణన్ని నేను కొనసాగిస్తా. కాదుకాదూ, వాళ్ళతో నేను నడుస్తా.

కొండంత ఆశ. లోయంత భయం.

వాళ్ళు తప్పక బతుకుతారు. ఔను తప్పక బతుకుతారు. ఎలా చెప్పగలనంటే చిరుకొండడూ, అప్పూ చిరంజీవులుకదా!

--- // --

సెప్టెంబరు, 1987


Comments

Popular posts from this blog

A Madman's Diary - Lu Xiun, China 1919

Banyan Tree Judgement

Roti Pachchadi 2003