KSHIPANI
క్షిపణీ
ఉషా యస్ డానీ
“నా పేరుదేముందిలెండి.
ఇది నా
ఒక్కడి సమస్యకాదుగా! లక్షమందిమి వున్నాం. నాకిప్పుడు డెభ్భయి రెండేళ్ళు. మా నాన్నగారు
బుధబాలంగా నదిమీద పడవ కాంట్రాంక్టు చేసేవారు. మూడేళ్లకో పర్యాయం పాట వుండేది. ఆయన జాతియోద్యమంలో
చురుగ్గా పాల్గొనేవారు. అది బ్రిటీషువాళ్లకు నచ్చలేదు. పాట కాలం ఏడాది తిరక్కుండానే
కాంట్రాక్టు రద్దు చేశారు. పైపెచ్చు మూడేళ్ళయ్యాక కాంట్రాక్టు సొమ్ము కట్టమని మామీద
వత్తిడి తెచ్చారు. మా ఇల్లు జప్తు చేశారు. సామాన్లన్నీ ఎత్తుకుపోయారు. గొడ్లని తోలుకుపోయారు.
నేను మూడో తరగతి చదివా. ఎలిమెంటరీ స్కూల్లో. మూడో తరగతి అంటే మీకు తెలుసుగా! ఇక చదువు సాగలేదు.
నాన్నగారితోపాటే కాంగ్రెస్ లో తిరిగేవాడ్ని. గాంధీగారి ఉప్పు సత్యాగ్రహంలో
పాల్గొన్నా. ఆ రేవు ఇక్కడే వుంది. పది కిలోమీటర్లు దగ్గర్లో! దాన్ని ఇప్పుడు గాంధీఛతర్
అంటున్నారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నా. జైలుకెళ్ళా. చాలాసార్లు.
దేశం కోసం సర్వాన్ని ఫణంగా పెట్టాను. తల్లిదండ్రుల్ని కోల్పోయాను.
కట్టుకున్న భార్యను సుఖపెట్టిందీలేదు. పిల్లల భవిష్యత్తును తీర్చి దిద్దిందీలేదు.
ఇన్నాళ్ల తరువాత ఇదిగో ఇప్పుడు ప్రభుత్వం నాకు దేశభక్తి పాఠాలు
నేర్పాలనుకుంటోంది. కాలం ఎలా మారిపోయిందో చూడండి!.
ఇది చూశారా? రైల్వే పాస్! ఫస్ట్ క్లాస్ ది అన్నమాటా! ’భారత దర్శనం’
కోసం ఇచ్చారు. స్వాతంత్ర సమరయోధుడ్నికదా! నేను
వెళ్ళలేదు. ఎక్కడికో వెళ్ళి నేనేం దర్శించుకునేదీ?
ఇక్కడే,
మా ఊర్లోనే రోజూ భారత దర్శనం చేసుకుంటున్నా! కడుపు నిండిపోతోంది!
ప్రధాని నిరాయుధీకరణ గురించి మాట్లాడుతున్నారు! మరి ఇక్కడ చూడండి
క్షిపణి కేంద్రాన్ని నెలకొల్పుతారట. అదోదో వాళ్ళ వ్యవహారంలే మనకెందుకు? అనుకుందామనుకుంటే
కుదిరేటట్లులేదు. దానికి మా భూములే కావాలట. అదెలా కుదురుద్దీ!
దేశానికి రక్షణ కావలసిందే. వద్దనను. ముందు ప్రజల రక్షణ జరగాలి. ప్రజల కోసం దేశరక్షణ జరగాలి.
మాకేం తెలియదని అనుకోకండి. మన భ్రమగానీ, లంచాలు తిని కొన్న ఆయుధాలు
దేశాన్ని రక్షిస్తాయా? అయినా, మమ్మల్ని రక్షించలేని ప్రభుత్వం దేశాన్ని మాత్రం ఏం రక్షించి
ఛస్తుందీ?!
బ్రిటీషువాళ్ళు మా ఇల్లు గుల్ల చేశారు. వీళ్ళు మా నేలను లాక్కోవడానికి
వచ్చారు. అప్పుడూ నేను ఉద్యమకారుడ్నే! ఇప్పుడైనా అంతే!
ముసలివాడ్నయిపోయాను. నిజమే! ఒంట్లో సత్తువ తగ్గి వణుకుతున్నానని
అనుమానించకండి. వయసుదేముందనీ. ప్రాణం ఇంకా మిగిలుందిగా!
ప్రభుత్వం ఏం చెప్పిందో విన్నారా? ఇంటికి ఇల్లు ఇస్తుందట!. భూమికి
భూమి ఇస్తుందట!
ఇది మాకు మట్టికాదండి. ఉత్తమట్టి కాదండి. నెత్తుటి ముద్దగా ఈ నేలలో
పుట్టేం. ఈ నేల మమ్మల్ని తాపింది. లాలించింది. ఆడించింది. పెంచి పెద్దవాళ్లను చేసింది.
ప్రభుత్వం ఉంది చూశారూ అది మనుషుల్ని ఆస్తిపాస్తులతో కొలుస్తుంది.
అసలు ఇల్లూ వాకిలి ఏవీ లేనోళ్ళు ఇక్కడ చాలామంది
వున్నారు. వాళ్లంతా ఊరిని నమ్ముకుని బతుకుతున్నారు.
వాళ్ల గతేంకానూ?
ఇక్కడ వున్నట్టే సముద్రాలు ప్రపంచమంతటా వుండవచ్చు. ఆ సముద్రాలు
వేరు. మా సముద్రం వేరు. అసలు బంగాళాఖాతమే అన్నిచోట్లా ఒకే తీరుగా ఉండదు. ఒక్కోచోట ఒక్కోలా
వుంటుంది. మా ఊరి సముద్రానికి తగ్గట్టు మా బతుకులు ఉన్నాయి. మా పడవలు వున్నాయి. మా
వలలు వున్నాయి. ఇంకో చోట ఇవేమీ పనికిరావండి.
మా సముద్రం ఎప్పుడు నవ్వుతుందో ఎప్పుడు కుంగిపోతుందో మాకు తెలుసు.
అప్పుడప్పుడు దానికి కోపం కూడా వస్తుంది. అయినా అది మా సముద్రమే కదండి. అది ఆనందంగా
వున్నప్పుడు దాని ఒళ్ళో ఒదిగి కేరింతలు కొడతాం. ఇంకోచోట అలా చొరవగా వెళ్లగలమా చెప్పండీ?
కొత్తచోట నీళ్లను చూస్తే అందులో దిగడానికి భయపడిపోతాం. ఆడవాళ్లందరూ
ఎవరో ఒకరికి తల్లులై వుండవచ్చు. అలాగని, ఆడవాళ్లందర్నీ మన తల్లులు అనుకోలేం కదండీ!
ఎవరినిపడితేవారిని తల్లి అనుకుని, ఎవరి ఒళ్ళోకిపడితేవారి ఒళ్ళోకి వెళ్ళలేం కదండీ?
మా సువర్ణరేఖా నదికి కోపం వచ్చినపుడు పొంగుతుంది. చేలు మునిగిపోతాయి.
పంటలు దెబ్బతింటాయి. మాకు కోపంరాదు. తల్లి అలిగింది అనుకుంటాం. అసలు వరదలే లేకుంటే
మా నేలలో ఇలా బంగారం పండేదికాదండి. మేమేం విదేశీ ఎరువులు గట్రా వాడమండి. ఒక్క చెయ్యి
మీద ఒరిస్సా మొత్తానికి అన్నం పెడుతున్నామంటే అది సువర్ణరేఖ చలవేనండి. మా భూమి అక్షయపాత్ర.
తూర్పుకనుమలు మాకు పెద్ద దిక్కండి. ఆ కొండల పైన్నుండి పాయలుపాయలుగా
నిత్యం నీళ్ళు ప్రవహిస్తాయి. అదే మా పాలిట
ఎత్తిపోతల సౌకర్యం అనుకోండి. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి మాకోసం కొత్తగా చేసిపెట్టే సౌకర్యం మాత్రం ఏముందనీ!
ఊరొదిలి
వెళ్ళిపోయామే అనుకోండీ, అక్కడివాళ్ళు మమ్మల్ని పరాయివాళ్ళుగా చూస్తారు. మేము బాగా బతికినట్టువాళ్లకు
తెలీదుకదండి. మమ్మల్ని అనుమానిస్తారు. దొంగల్ని చూసినట్టు చూస్తారు. అసలు మమ్మల్నే
దొంగల్ని చేసేసినా చేసేస్తారు. చాలాచోట్ల అలా జరుగుతోంది కూడా!
నాల్కో
ప్రాజెక్టు తెలుసా? కోరాపుట్ దామన్ జోడీలో...
అక్కడ పదేళ్ళు దాటిపోయినా నిర్వాశితులకు పునరావాసం జరగలేదు. కేసు కోర్టులో ఇరుక్కుపోయింది.
ఏమయిందో తెలుసా? నిర్వాశితుల్లోని మాల కుర్రాడొకడు జిల్లా జడ్జిని చంపేశాడు. హత్య! అంతే! ఇల్లూ వాకిలి, చుట్టం పక్కం,
అన్నీ లాక్కొని మనుషుల్ని దారీతెన్నూలేకుండా చేసి రోడ్డు మీద పడేస్తే మరేమవుతుందనీ!
పరాయి నేలలో మేమైపోతాం చెప్పండి. మాచేత గారడీ ఆడిస్తారు. మోళీ
కట్టిస్తారు. అడవిని వదిలితే పులి బతుకేం అవుద్దీ!
మమ్మల్ని
సంతల్లో నిలబెట్టి ముక్కలుగా కోసి పోగులుపెట్టి అమ్మేస్తారు. నీటి నుండి బయటికివస్తే
చేపల గతి ఏమవుద్దీ!
వరదలకు కొట్టుకొచ్చి మా చేలల్లో ఇరుక్కుపోయిన పడవల్ని చూసేరా?
ఎంత నిర్జీవంగా వున్నాయో! అలా అయిపోతాం మేం.
ఆ అవమానపు బతుకు వద్దు.
అంతకన్నా స్వంత ఊరిలో చావు మేలు. మనిషిని నిలువునా చీరేసి, కాళ్లను ఒకచోట, తలను మరోచోట,
మొండేన్ని ఇంకోచోట విసిరేస్తే ఇంక వాడు మనిషిగా మనగ్గలడా?
అర్ధం అవుతోందా? సమస్య పునరావాసానిదికాదు. నష్టపరిహారాల బేరసారాలది
అంతకన్నాకాదు. భూమిది. జన్మభూమిది!.
పుట్టిపెరిగిన ఊరిని అర్ధంతరంగా వదలమంటారా? జన్మభూమిని వదలమంటారా!
తల్లి ఒడి నుండి పిల్లల్ని ఎత్తుకుపొతామంటారా? ఇంతటి దౌర్జన్యానికి బ్రిటీషువాళ్ళే
ఒడిగట్టలేకపోయారు. వలస ప్రభువులు ఇక్కడికొచ్చి మమ్మల్ని పాలించారు. మమ్మల్ని ఇక్కడి
నుండి వెళ్ళిపొమ్మనలేదు!
బ్రిటీష్
పాలన కాలంలో శాసనోల్లంఘనం చేశాను. ఇప్పుడూ
ఆ పనే చేస్తా. వాళ్లను భారతదేశాన్ని వదిలి వెళ్ళిపొమ్మన్నాను. వీళ్లనైనా అంతే. బలియాపాల్
ను వదిలి వెళ్ళిపొండి అంటున్నాను.
మేము అప్పుడూ ఇప్పుడూ ఒకేమాట మీద వున్నాం. తిరిగితిరిగి ఒకే కోరికను
కోరుతున్నాం. స్వేఛ్ఛ!. ప్రభుత్వం దాన్ని నెరవేరుస్తానంది. ఇప్పుడేమో మాటతప్పింది.
స్వేఛ్ఛ
చిన్నపదం అనుకోమాకండి. దానికోసం నా బతుకులో
అరవయ్యేళ్ళు ధారబోశాను. ఇక ఇప్పుడీ చివరి రోజుల్లో దాన్ని వదులుకోలేను. ఇది నా బలహీనత
అనుకుంటారా? అనుకోండి. నా మానాన నన్ను, నాలాగ నన్ను బతకనివ్వండి చాలు!
మనోళ్ళు
యుధ్ధాలు వద్దంటున్నారుగా. మంచిదే. మా మీద మాత్రం యుధ్ధానికి రావద్దని చెప్పండి. మా ఊర్లకు వెచ్చాల సరఫర బంద్ చేశారు. చెయ్యనివ్వండి. పంచదార లేకుంటే తాటిబెల్లం
చేసుకున్నాం. మరొకటి లేకుంటే ఇంకొకటి చేసుకుంటాం. మట్టి నూనెతప్పా ఇక్కడ అన్నీ వున్నాయి.
మేము మా మట్టి మీదే నిలబడి వున్నాం. అర్ధం అవుతుందికదూ!
ఇది ఇంతటితో ఆగేటట్టులేదు. పోలీసులు వచ్చారు. తుపాకులు పట్టుకుని
గోర్కా పోలీసులు వచ్చారు. మా స్కూళ్ళు కాలేజీలు వాళ్లతోనే నిండిపోయాయి. ఇక అక్కడ కొత్త
పాఠాలు నేర్పుతారు కామోసు!
మాకు ఆయుధాలు లేవు. మాకు వాటితో పనిలేదు. మాకున్నది ఒకే ఒక ఆయుధం.
ఈ నేల మీద ఇంత ప్రేమ. మా చిత్తడి నేలల్లా మాలో మానవత్వం ఇంకా తడితడిగానే వుంది. అది
ఓడిపోయి మేము చనిపోయామే అనుకోండి. అప్పుడూ గెలుపు మాదే!
మా అమ్మానాన్న ఇక్కడే చనిపోయారు. మా ఇల్లు చూశారుగా! మట్టి ఇళ్ళు.
కూలిపోతున్నదని చిన్నచూపు చూడకండి. గోడలు ఇంకా కూలిపోలేదు. వాటిని ఉత్త గోడలు అనుకోమాకండి.
నిజం చెపుతున్నా అవి మా పూర్వికుల బొమికల గూళ్ళు! జీవంలేదని సందేహించకండి. ఈ నేలను
గట్టిగా అతుక్కొని వుండిపోవడమే వాటికి జీవం.
మీరింకా పసిపిల్లలు. జీవం గురించీ, జీవితం గురించీ మీకు అంతగా
తెలీదు.
ఇక్కడ మేము కలలుగన్నాం. మీరెవరూ వాటిని నిజం చెయ్యలేదు. మా కలల్ని
నిర్దాక్షిణ్యాంగా చితిపివేశారు. నిర్దాక్షిణ్యాంగా!
ఇప్పుడైనా
సరే మమ్మల్ని ఇలా కలలు కంటూ ఉండిపోనివ్వండి. కనీసం కలలుకనే అవకాశాన్నైనా మాకు మిగల్చండి".
(బలియాపాల్ నేషనల్ టెస్ట్ రేంజ్
నిర్మాణ వ్యతిరేక పోరాట సమితి నాయకుడు, నిరంతర
స్వాప్నికుడు బ్రిందాబన్ రాజ్ కు సవినయంగా )
బాలాసూర్
జులై, 1988
ప్రచురణ : ఉదయం దినపత్రిక
13 July 1988
.png)
.png)
Comments
Post a Comment